జూన్‌ 2 నుంచి నవ నిర్మాణ దీక్ష

Admin 2018-05-25 Politics

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని వచ్చే నవ నిర్మాణ దీక్షలో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జూన్‌ 2 నుంచి వారం రోజులపాటు జరిగే నవ నిర్మాణ దీక్ష, ముగింపుగా నిర్వహించే మహా సంకల్పం కార్యక్రమాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గురువారం ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాలులో అధికారులతో సమీక్షించారు. జూన్‌ 2న తొలి రోజు నవ నిర్మాణ దీక్ష విజయవాడలోని బెంజి సర్కిల్‌లో జరుగుతుంది. 8 వరకూ దీక్షలు కొనసాగుతాయి. నవ నిర్మాణ దీక్షలు జరిగినన్ని రోజులు ముఖ్యమంత్రి ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. 12 వేల గ్రామాల్లో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు జరిగే మహా సంకల్ప సభలో రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. నవ నిర్మాణ దీక్ష జరిగినన్ని రోజులు ఒక్కో రోజు ప్రభుత్వం సాధించిన ఒక్కో విజయంపై వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘ఓడీఎఫ్‌, పంట కుంటలు, ఫైబర్‌ గ్రిడ్‌, 3 లక్షల మందితో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం, గృహ నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్యం, పౌష్టికాహార లోపం, రక్తహీనతల్ని నివారించడం, అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటివి ప్రభుత్వం సాధించిన విజయాలు. వీటిలో చాలా కార్యక్రమాల్లో త్వరలోనే సంతృప్త స్థాయికి చేరనున్నాం. ఐదు గ్రిడ్‌లలో విద్యుత్‌, గ్యాస్‌, సిమెంట్‌ రోడ్లకు సంబంధించి ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరాం. దేశంలో మరే రాష్ట్రం ఇన్ని విజయాలు సాధించలేదు. అద్భుతంగా పనిచేసిన ఉద్యోగులందరినీ, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగానికి చెందిన వారిని అవార్డులతో సత్కరించాలి’ అని సీఎం పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్ష- మహాసంకల్పం

Previous Post