రెండ్రోజుల్లో రూ.420కోట్లు కట్టండి..

Admin 2018-04-04 Business

చెన్నై: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కార్పొరేషన్‌ రెండు రోజుల్లో రూ.420కోట్లు చెల్లించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఇందు కోసం కంపెనీకి చెందిన ముంబయిలోని జేపీ మోర్గాన్‌ బ్యాంకు ఖాతాను తిరిగి నడిచేలా చేయాలని కోర్టు వెల్లడించింది. కాగ్నిజెంట్‌ ‌ సుమారు రూ.2800 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. దీంతో చెన్నై, ముంబయిలలో సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేశారు. కంపెనీ ఐటీ శాఖకు రూ.2800కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను విభాగం చెప్తుండగా, అందులో 15శాతం అంటే దాదాపు రూ.420కోట్లు వెంటనే రెండు రోజుల్లోగా కాగ్నిజెంట్‌ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ముంబయిలోని జేపీ మోర్గాన్‌ బ్యాంకు ఖాతాకు మాత్రమే కోర్టు సడలింపు ఇచ్చింది. ఇతర బ్యాంకుల్లోని ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని తెలిపింది.

కాగ్నిజెంట్‌ కంపెనీ ఐటీ శాఖకు రూ.2800కోట్ల మేర డివిడెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ కట్టాల్సి ఉంది. 2013 నుంచి 2016 మధ్య ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉందని ఆదాయపన్ను శాఖ చెప్తోంది. పన్ను కట్టకపోవడంతో కంపెనీకి పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. వీటికి సంస్థ స్పందించకపోవడంతో ముంబయి, చెన్నైలలోని కాగ్నిజెంట్‌ బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. తమ కంపెనీకి చెందిన 68 బ్యాంకు ఖాతాల నిలుపుదలను ఎత్తేయాలని కోరుతూ కాగ్నిజెంట్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పన్నులో 15శాతం కట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.

Previous Post