జెట్ ఎయిర్‌వేస్‌కు మరో 75 బోయింగ్‌ విమానాలు

Admin 2018-04-04 Business

దిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలోకి మరో 75 విమానాలు చేరనున్నాయి. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ నుంచి 75 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు 8.8 బిలియన్‌ డాలర్లతో(భారత కరెన్సీలో దాదాపు రూ. 57వేల కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకే ఈ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ ఒప్పందం గురించి జెట్‌ఎయిర్‌వేస్‌ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. అటు బోయింగ్‌ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. ఈ ఒప్పందం చివరి దశలో ఉందని, మార్చి చివరి నాటికి పూర్తయ్యే అవకాశముందని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ దుబే గత నెల్లో మీడియాకు తెలిపారు.

భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ జనవరిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 17.9శాతం పెరిగింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా విమానయాన సంస్థలు కూడా తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచుతున్నాయి. ఇందుకోసం కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్‌ వద్ద ప్రస్తుతం 119 విమానాలున్నాయి. ఇందులో బోయింగ్‌, ఎయిర్‌బస్‌, ఏటీఆర్‌ మోడళ్ల ఉన్నాయి.

Previous Post