యూట్యూబ్‌ ఘటన విని మాటలు రావట్లేదు: పిచాయ్‌

Admin 2018-04-04 Business

వాషింగ్టన్‌: యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పుల ఘటనపై ఆ సంస్థ పేరెంట్‌ కంపెనీ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సిబ్బందికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఈ రోజు జరిగిన దాడి గురించి విన్నాక మాటలు రావట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను, యూట్యూబ్ సీఈవో సూసన్‌ వోజ్సికి ఉద్యోగులకు అండగా ఉంటాం. సకాలంలో స్పందించిన పోలీసులు, స్థానికులకు కృతజ్ఞతలు. మాకు అండగా సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అని పిచాయ్‌ ట్వీట్‌ చేశారు.

ఘటనపై యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌, గూగుల్‌ సిబ్బందికి యాపిల్‌లోని ప్రతి ఒక్క ఉద్యోగి నుంచి సానుభూతి తెలుపుతున్నామని కుక్‌ ట్వీట్‌ చేశారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల కూడా యూట్యూబ్‌ బాధితులకు సంతాపం తెలిపారు.

అమెరికాలోని శాన్‌బ్రూన్‌లో గల యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు యూట్యూబ్‌ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులకు పాల్పడిన మహిళను దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన నసీమ్‌ అగ్దమ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది.

Previous Post