శామ్‌సంగ్‌ 3,600కోట్లు యాపిల్‌కు కట్టాల్సిందే డిజైన్‌ పేటెంట్‌ కేసులో అమెరికా కోర్టు తీర్పు

Admin 2018-05-25 Business

శాన్‌జోస్‌: దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ మొబైల్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల నాటి యాపిల్‌ డిజైన్‌ పేటెంట్‌ కేసులో అమెరికా ఫెడరల్‌ కోర్టు శామ్‌సంగ్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఐఫోన్‌ డిజైన్‌ను కాపీ చేసినందుకు గానూ శామ్‌సంగ్‌.. యాపిల్‌కు 533 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.3,600కోట్లు) చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రెండు పేటెంట్ల ఉల్లంఘనలకు గానూ మరో 5 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాలని ఆదేశించింది. శామ్‌సంగ్‌ తమ ఐఫోన్ డిజైన్‌ను కాపీ కొట్టిందంటూ 2011లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గుండ్రటి ఎడ్జ్‌లతో ఉండే ఐఫోన్‌ బ్లాక్‌ స్క్రీన్‌, బేజెల్‌, గ్రిడ్‌ ఐకాన్లను శామ్‌సంగ్‌ కాపీ కొట్టిందని యాపిల్‌ ఆరోపించింది. ఇందుకు గానూ శామ్‌సంగ్‌ నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేసింది. తమ డిజైన్‌ ద్వారా శామ్‌సంగ్‌ కంపెనీకి లాభం వచ్చింది గనుక ఆ లాభాల్లో 1 బిలియన్ డాలర్లను యాపిల్‌కు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే శామ్‌సంగ్‌ మాత్రం తాము 28 మిలియన్‌ డాలర్లు మాత్రమే చెల్లిస్తామని తెలిపింది. దీనిపై రెండు సంస్థల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా శాన్‌జోస్‌లోని ఫెడరల్‌ కోర్టు దీనిపై తీర్పు వెల్లడించింది. యాపిల్‌ డిజైన్‌ను కాపీ కొట్టడం ద్వారా శామ్‌సంగ్‌కు వచ్చిన లాభం ఎంత అనేదాన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాత శామ్‌సంగ్‌ 533 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శామ్‌సంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Previous Post