త్వరలో చనిపోతా..తిట్టాలంటే..

Admin 2018-04-04 Cinema

వివాదస్ప‌ద మూవీ స‌మీక్ష‌కుడు బాలీవుడ్‌ నిర్మాత, నటుడు, కమాల్‌ రషీద్‌ ఖాన్‌ (కెఆర్‌కె) మరోసారి కలకలం సృష్టించాడు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాలపై వివాదాస్పద రివ్యూలతో పాపులర్‌ అయన కమాల్‌ ఆర్‌ ఖాన్‌ ఈసారి ఓ విషాద వార్తతో సంచలనం రేపాడు. తనకు స్టమక్‌ కాన్సర్‌ (జీర్ణాశయ క్యాన్సర్) సోకిందని ట్విటర్‌లో వెల్లడించాడు. ఈ మేరకు కేఆర్‌కే బాక్స్‌ ఆఫీస్‌ ట్విటర్‌లో నిన్న (మంగళవారం) విడుదల చేసిన ఒక ప్రకటన వైరల్‌ అయింది.

తనకు సోకిన క్యాన్సర్‌ వ్యాధి థర్డ్‌ స్టేజ్‌లో ఉందని మహా అయితే తాను ఒకట్రెండేళ్లు మాత్రమే బతికి వుంటానని ట్వీట్‌ చేశాడు. దీంతోపాటు తనను ఎవరైనా తిట్టాలనుకున్నా.. ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే ఎప్పటిలాగే కొనసాగించవచ్చని..కానీ కాల్స్‌ మాత్రం చేయవద్దని కోరాడు. అయితే, తనపై ఎవరూ జాలిపడొద్దని, తనను ఓదార్చేందుకు ఫోన్లు చేయద్దని కోరాడు. ఇన్నాళ్లూ తనను తిట్టిన వారికి, ద్వేషించిన వారికి అభినందనలు తెలియజేసిన కమాల్, అందరూ తనను ద్వేషించినా, తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.

అయితే ఎప్పటికీ నెరవేరని రెండే రెండు కోరికలు మిగిలిపోయాయని తెలిపాడు. ‘ఒకటి: గొప్ప (ఏ గ్రేడ్‌) ప్రొడ్యూసర్‌ కావాలనుకున్నా.. రెండు: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి పనిచేయాలనుకున్నా. కానీ ఇవి రెండూ నాతో పాటే సమసిపోనున్నాయంటూ’ ఖాన్‌ తన ప్రకటనలో వెల్లడించాడు. ఇక నుంచీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఇన్నాళ్లూ అతన్ని ద్వేషించిన వారు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు.

కాగా 2008లో భోజ్‌పురి సినీ నిర్మాతగా కరియర్‌ను ప్రారంభించిన కమాల్‌ ఆర్‌ ఖాన్‌ వివాదాస్పద బాలీవుడ్‌, టాలీవుడ్‌ మూవీ రివ్యూలు, సినిమా ప్రముఖులపై ముఖ్యంగా అమీర్‌ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలతో వెలుగులో వచ్చాడు. దీంతో అప్పట్లో ట్విటర్‌​ అతని ఖాతాను కూడా తొలగించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 తనకు నచ్చలేదంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Previous Post