అభిషేక్‌పై నెటిజన్‌ కామెంట్‌ దీటుగా సమాధానమిచ్చిన జూనియర్‌ బచ్చన్‌

Admin 2018-05-25 Cinema

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌.. ఓ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌కు దీటుగా సమాధానమిచ్చారు. బాబీ డియోల్‌ అనే నెటిజన్‌ ఒకరు అభిషేక్‌ను ఎగతాళి చేస్తూ ఓ ట్వీట్‌ పెట్టాడు. ‘క్రికెటర్‌ స్టూవర్ట్‌ బిన్నీ, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్ ఒకే రకం. అర్హులు కాకపోయినప్పటికీ వీరిద్దరికీ అందమైన భార్యలు దొరికారు. తమ తండ్రుల పాపులారిటీని వాడుకుని ఒకరు సినిమాల్లో, మరొకరు క్రికెట్‌లోకి వచ్చారు. ఇద్దరూ పనికిరానివాళ్లే. ఇది నిజమని అనిపిస్తే మీరూ రీట్వీట్ చేయండి’ అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ కాస్తా అభి కంట పడింది. దాంతో నెటిజన్‌ సిగ్గుతో తలదించుకునేలా దీటుగా సమాధానమిచ్చారు. ‘నా స్థానంలో నువ్వుండి ఒక మైలు ప్రయాణించి చూడు. నువ్వు పది అడుగులు నడవగలిగినా నేను సంతోషిస్తాను. నీ ట్వీట్‌ను బట్టి చూస్తే నువ్వు నాలా ప్రయాణించలేవని అర్థమవుతోంది. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. ఇతరుల గురించి చింతించకు. ఎవరి ప్రయాణం వారిది అన్న విషయం దేవుడికి తెలుసు’ అని పేర్కొన్నారు.

ఇందుకు ఆ నెటిజన్‌ స్పందిస్తూ..‘అభి..నేనేదో సరదాగా అలా అన్నాను. థియేటర్లో నీ సినిమాలు బాగా ఆడకపోయినా నీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ అంటే నాకు ఇష్టం. ఏదో జోక్‌ చేశాను. ఇందుకు నువ్వు బాధపడి ఉంటే క్షమించు. బచ్చన్‌ కుమారుడివైన నీపై, సచిన్‌ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్‌పై ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. క్షమించు’ అని వేడుకున్నాడు.

గతంలోనూ అభికి ఓ నెటిజన్‌ నుంచి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. పెళ్లయ్యాక కూడా ఇంకా భార్య పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇందుకు అభి సమాధానమిస్తూ..‘అవును. వారు ఒకప్పుడు నాకు తోడుగా ఉన్నట్లే ఇప్పుడు నేను వారి కోసం తోడుగా ఉంటున్నందుకు గర్విస్తున్నాను. మీరూ మీ తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ప్రయత్నించి చూడండి. అది మీకెంతో ఊరటనిస్తుంది’ అని చెప్పి నెటిజన్‌ నోరుమూయించారు.

Previous Post