ఎక్కడ యూటర్న్‌ చూసినా ఆయనే గుర్తొస్తారు!

Admin 2018-04-04 Politics

న్యూఢిల్లీ: ‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ యూటర్న్‌ కనిపించినా.. చంద్రబాబే గుర్తొస్తున్నారు. యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చినా.. ఇది చంద్రబాబు రహదారి, మనకెందుకులే అని ముందుకు వెళ్లాలని అనిపిస్తోంది. యూటర్న్‌ అంకుల్‌ ప్రతి విషయంలోనూ యూటర్న్‌ తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఆయనకు క్రెడిబిలిటీ లేదు. రహదారిలో యూటర్న్‌ ఉన్న ప్రతిచోట ఆయన బొమ్మలు ఉంచాలి. అప్పుడైనా ఆయన జ్ఞానోదయం అవుతుందేమో’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అధికార అంతమందు చూడవలేరా అయ్యగారి సొబగులు అన్నట్టు చంద్రబాబు పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. దావోస్‌కు వెళ్లి సదస్సు పేరిట ఇడ్లీ, వడ, పొంగల్‌ పేరిట ఆంధ్ర వంటలను చంద్రబాబు ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద, కిక్కిరిసిన బస్సుల్లో నూరు, యాబై అని బ్లాక్‌టిక్కెట్టులు అమ్ముతారని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరిస్తూ.. చంద్రబాబు కలిసేందుకు వీలు కల్పించాలని పలు పార్టీల నేతలను బతిమిలాడుకుంటున్నారని విమర్శించారు. సినిమా షూటింగ్ తరహాలో రెడీ.. క్లాప్‌.. 1, 2, 3.. అనగానే చంద్రబాబు పోజులు ఇచ్చారని, ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఈరకంగా ప్రవర్తిస్తున్న మహానుభావుడు ఆయన అని అన్నారు.

టీడీపీ సైకిల్‌ రెండు చక్రాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ ఒక చక్రం, జనసేన మరో చక్రంగా వ్యవహరించిందని, అంతకుముందు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు సైకిల్‌ చక్రాలుగా పనిచేశాయని, ఇప్పుడు రెండు చక్రాలు ఊడిపోవడంతో చక్రాలు లేని సైకిల్లా ఆ పార్టీ పరిస్థితి మారిపోయిందని అన్నారు. చంద్రబాబును ఎవరు విశ్వసించడం లేదని, ఆయనను ఎవరూ కలిసేందుకు సిద్ధపడటం లేదని, చంద్రబాబు ఏకాకిగా మారిపోయారని అన్నారు. ఇప్పుడు ఫ్యాన్‌ బాగా తిరుగుతోందని, తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఏపీలోని 25 ఎంపీ స్థానాలనూ గెలుపొందుతుందని,150 అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుందని, తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు.

హోదా కోసం వచ్చి బీజేపీ నేతలను కలవడమేంటి? ఢిల్లీలో చంద్రబాబు వ్యవహారిస్తున్న తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో హేమామాలిని, బీజేపీ నేతలను కలిశారని, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చి.. బీజేపీ నేతలను కలవడమేంటని చంద్రబాబును నిలదీశారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఫొటోషూట్‌ కోసమే ఆయన ఢిల్లీకి వచ్చినట్టు ఉందని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరిలాంటిదని, తమ ఊపిరి ఉన్నంతవరకు హోదా కోసం పోరాడుతామని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతూనే ఉంటామని, సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌ వెల్లడించారు. అవిశ్వాస తీర్మానానికి సహకరించాలని అన్ని పార్టీలను కోరినట్టు తెలిపారు.

Previous Post