కర్ణాటక భాగ్య పథకాలు కాంగ్రెస్‌కు భాగ్యమేనా ?

Admin 2018-04-04 Politics

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని నినదిస్తున్న బీజేపీ కన్నడ నేలపై విజయం సాధించడం ద్వారా దక్షిణాదిన పాగా వెయ్యాలని తహతహలాడుతుంటే, అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక సై్థర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమై ఉంది.

మరి ఓటర్ల నాడి ఎలా ఉంది ? సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు ? గత అయిదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేరుస్తాయా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి అసోసియేషన్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), దక్ష స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,244 మందితో మాట్లాడారు. 2017 డిసెంబర్‌ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య ఈ సర్వేని నిర్వహించారు.

ఏయే సంక్షేమ పథకంపై ప్రజలు ఏమంటున్నారు?

సంక్షేమం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది దివంగత నేతలు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జయలలితలే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వారిని స్ఫురణకు తెచ్చేలా గత అయిదేళ్లలో భాగ్య పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమమే ఓట్లు రాలే అంశంగా మారితే కనుక కాంగ్రెస్‌ పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రారంభించిన అన్నభాగ్య పథకానికి ఈ సర్వేలో అనూహ్య స్పందన వచ్చింది. దారిద్య్రరేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యాన్ని ఇచ్చే ఈ పథకం అద్భుతమైనదంటూ 79 శాతం మంది కితాబు ఇచ్చారు. మరో 14 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తే, 6శాతం మంది ఆ పథకాన్ని వినియోగించలేదని వెల్లడించారు.

Previous Post