మీరు సహనాన్ని పరీక్షిస్తున్నారు..

Admin 2018-04-04 Politics

దిల్లీ: సభా సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఎటువంటి చర్చలు జరగనీయకుండా ఆందోళన చేయడాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. సభ్యులు సమావేశాలను జరగకుండా చేస్తుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికి కొత్తగా ఎన్నికైన 12 మంది రాజ్యసభ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అన్నాడీఎంకే నేతలు, తెలుగుదేశం ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తుండటంతో విసిగిపోయిన వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

‘సభలో ఎటువంటి బిల్లులు పాస్‌ అవడం లేదు. దేశం అభివృద్ధిని కోరుకుంటుంది. మీరు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. శాంతించండి.. చర్చలకు సహకరించండి. దేశ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోండి. ప్రతీ అంశంపై చర్చించడానికి అనుమతి ఇచ్చాను. కానీ దురదృష్టవశాత్తూ చర్చలు జరగడం లేదు. ఇది దేశ ప్రజల దురదృష్టం. చర్చలకు ఛైర్మన్‌, ప్రభుత్వం అంగీకరించినప్పటికీ చర్చలు జరగడం లేదు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఇది ఖూనీ చేసినట్లే. పరిస్థితిపై దేశ ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు’ అని వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమావేశాలు ప్రారంభం కాగానే ఓవైపు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై కాంగ్రెస్‌, బీఎస్పీ నేతలు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా అన్నాడీఎంకే నేతలు.. ఇంకోవైపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక లోక్‌సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. రోజు మాదిరిగానే బుధవారం కూడా అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనతో సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

Previous Post