బెజవాడలో పాదయాత్ర చేస్తా: పవన్‌

Admin 2018-04-04 Politics

హోదా పేరుతో ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కొన్నేళ్ల కిందట ఆ పని చేసి ఉంటే బాగుండేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హోదా సాధన పోరాటంలో భాగంగా సీపీఐ, సీపీఎంలతో కలిసి ఏప్రిల్‌ 6న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం విజయవాడలో ఏపీ సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నేను విజయవాడలో: జాతీయ రహదారులపై శాంతియుత పద్ధతుల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్న పవన్‌.. 6న తాను కూడా విజయవాడలో పాదయాత్ర చేస్తానని తెలిపారు. సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై చేసిన అవినీతి ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గబోనని పవన్‌ మరోసారి స్పష్టం చేశారు. ‘లోకేశ్‌పై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేదు’ అని జనసేన చీఫ్‌ చెప్పారు.

ఏపీ అంటే అవి రెండే కాదు: ఆంధ్రప్రదేశ్‌ అంటే అమరావతి, పోలవరం మాత్రమే అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యరదర్శి రామకృష్ణ అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోకుండా, అభివృద్ధిని కేంద్రీకృతం చేసేస్తున్నారని మండిపడ్డారు. జనసేనతో కలిసి 6న పాదయాత్ర చేస్తామని, సీపీఎం పార్టీ పరంగా హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికోసం నిరంతరాయంగా పోరాడుతామని తెలిపారు. 15న అనంతపురంలో, 24న ఒంగోలులో, మే 6న విజయనగరంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వివరించారు.

Previous Post