నడిరోడ్డుపై కన్నతండ్రిని హతమార్చారు!

Admin 2018-04-04 Politics

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కుమారులు కన్నతండ్రిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనుముల మండలం హాలియలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారెడ్డి గోవిందరెడ్డి తన అల్లుడు కూనిరెడ్డి సైదురెడ్డితో కలిసి ఏదో పని మీద బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా గోవింద రెడ్డి కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలు ఒక్కసారిగా తండ్రి, బావ సైదురెడ్డిలపై దాడికి పాల్పడ్డారు.

కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తండ్రి గోవిందరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వీరి బావ సైదురెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న గోవింద రెడ్డి మృతదేహం పక్కన ఆంధ్రా బ్యాంకు పాస్‌బుక్ ఉందని పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ సైదురెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Previous Post