Facebookలో ఇక ఇవి వాడలేం..

Admin 2018-04-05 Social

Facebook ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో అనేక కీలకమైన మార్పులు చేస్తోంది. మన Facebook అకౌంట్లో ఇప్పటికే వాడుతున్న పలురకాల అప్లికేషన్లను ఒకేసారి తొలగించే వెసులుబాటు Facebook కల్పించిందన్న విషయం నిన్న చెప్పుకున్నాం గదా.

ఆ క్రమంలో తాజాగా మరో కీలకమైన మార్పుని Facebook చేసింది. ఇప్పటివరకు Facebook అప్లికేషన్ పైభాగంలో ఉండే Search బాక్స్‌లో మనకు కావాల్సిన వ్యక్తుల కోసం, పోస్టుల కోసం వెతుకుతూ ఉంటాం కదా. ఇక్కడ సహజంగా ఎవరిదైనా ఫోన్ నెంబర్ గానీ, ఈ-మెయిల్ ఐడీ గానీ ఎంటర్ చేస్తే.. ఇప్పటికే ఆ రెండు వివరాలతో Facebookలో ఏవైనా ఎకౌంట్లు ఉన్నట్లయితే వాటి వివరాలను ఫేస్బుక్ సులభంగా చూపిస్తుంది.

మనకు బాగా తెలిసిన వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ మాత్రమే మనకు తెలిసినట్లయితే ఆ వివరాల ఆధారంగా వారి ఫేస్బుక్ అకౌంట్ వెదికి పట్టుకోవడం కోసం ఈ సదుపాయం ఉపయుక్తంగా ఉంటుంది. మంచిగా వాడుకుంటే ఇది బానే ఉంటుంది కానీ.. కొంతమంది డేటా మైనింగ్ చేయడం కోసం, రకరకాల పద్ధతుల ద్వారా సేకరించిన ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడిలు ఆధారంగా పెద్ద మొత్తంలో ఫేస్బుక్ యూజర్లు వ్యక్తిగత సమాచారం దొంగిలించడం కోసం దీన్ని దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో Facebook కొత్త మార్పులు చేసింది.

యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఇకపై Phone Number, Mail ID ఆధారంగా Facebookలో సెర్చ్ చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టం చేసింది. ప్రమాదకరమైన వ్యక్తులను అడ్డుకోవటానికి తీసుకువచ్చిన ఈ మార్పు ఒక సగటు యూజర్‌కి కూడా ఇబ్బందికరమే అయినప్పటికీ privacy కావాలంటే ఇలాంటివి కొన్ని భరించక తప్పదు.

Previous Post