అట్టహాసం.. అంగరంగ వైభవం - త్రివర్ణ పతాకంతో పీవీ సింధు కవాతు

Admin 2018-04-05 Sports

పాతికవేల మంది ప్రేక్షక సందోహంతో కిక్కిరిసిన స్టేడియం... మిరుమిట్లుగొలిపే రంగురంగుల దీపాల కాంతులు... ఆకాశం నుంచి ఆశీర్వదిస్తున్నట్లుగా వాన చినుకులు... సంప్రదాయం, స్థానిక ఆచారాల కలబోతగా కార్యక్రమాలు... ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో 21వ కామన్వెల్త్‌ క్రీడలు ఇలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వందన సమర్పణలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు త్రివర్ణ పతాకంతో ముందు నడవగా మిగతా బృందం ఆమెను అనుసరించింది. ఎప్పటిలా చీరకట్టు, బంద్‌గలాలతో కాకుండా మన క్రీడాకారిణులు బ్లేజర్లు, ట్రౌజర్లతో కవాతు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ‘ప్రపంచంలోనే పురాతన జీవన సంస్కృతి’కి ఆహ్వానం అంటూ అతిథులకు ఆహ్వానం పలుకుతూ కౌంట్‌డౌన్‌ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఐరోపా దేశాల దాడిలో దెబ్బతిన్న ఆస్ట్రేలియా సంస్కృతికి నివాళులర్పించారు. ఒకనాటి బ్రిటిష్‌ ఏలుబడిలోని దేశాల మధ్య నిర్వహిస్తున్న ఈ క్రీడలకు ఆనవాయితీగా బ్రిటన్‌ యువరాజు చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్‌ హాజరయ్యారు. వీరిద్దరూ పరేడ్‌ ట్రాక్‌పై కలిసి నడుస్తూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. పోటీలు ప్రారంభమైనట్లు చార్లెస్‌ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. కామెన్వెల్త్‌ క్రీడలను స్నేహపూరిత క్రీడలుగా ఆయన అభివర్ణించారు.

మన బంగారు బోణీ నేడేనా! గోల్డ్‌కోస్ట్‌: ప్రారంభోత్సవం ముగిసింది. పతకాల వేట మొదలుకానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీల తొలిరోజు గురువారం భారత పసిడి ఆశలన్నీ వెయిట్‌లిఫ్టర్లపై ఆధారపడి ఉన్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌ మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించింది. ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన (194 కేజీలు) కనబరిస్తే ఇక్కడా పసిడి పతకం ఖాయం. బరిలో ఉన్న మిగతా ప్రత్యర్థులకు మీరాబాయి ప్రదర్శనకు మధ్య 10 కేజీల వ్యత్యాసం ఉండటం గమనార్హం. మీరాబాయితోపాటు పురుషుల విభాగంలో గురురాజా (56 కేజీలు), రాజా ముత్తుపాండి (62 కేజీలు) తొలిరోజు పతకాల బరిలో ఉన్నారు.

Previous Post