ఐపీఎల్‌ ట్రోఫీ వచ్చేసింది

Admin 2018-04-05 Sports

హైదరాబాద్‌: ఓ వైపు ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల సాధన.. మరో వైపు టికెట్ల కోసం అభిమానుల ఆరాటం.. ఇలా నగరంలో ఐపీఎల్‌ జోరు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ హుషారును రెట్టింపు చేసేందుకు ఐపీఎల్‌ ట్రోఫీ నగరానికి వచ్చింది. దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ప్రదర్శించనున్న ఈ ట్రోఫీ హైదరాబాద్‌ చేరుకుంది. బుధవారం ఓ ప్రైవేటు షోరూమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌ ట్రోఫీ నగరానికి రావడం ఆనందంగా ఉంది. దేశాల మధ్య సరిహద్దులను చెరిపిన ఐపీఎల్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇస్తోంది. ఈ టోర్నీ ద్వారా చాలామంది ఆటగాళ్లు స్టార్లుగా మారారు. స్థానిక ఆటగాళ్లకు అవకాశాలిస్తూ వాళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ల వల్ల ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ తమ సత్తాచాటుతున్నారు. ఈ సారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజేతగా నిలవాలని కోరుకుంటున్నా. మన జట్టు చాలా బాగుంది. వార్నర్‌ దూరమవడం లోటే కానీ అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు’’ అని తెలిపాడు. ఐపీఎల్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోన్న టాటా నెక్జాన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Previous Post