సన్‌రైజర్స్‌.. ఏం చేస్తుందో! - ఐపీఎల్‌-11 మరో 2 రోజుల్లో

Admin 2018-04-05 Sports

బాల్‌ టాంపరింగ్‌తో వార్నర్‌ ఆటకు దూరమవడం ఆస్ట్రేలియాకు ఎంత నష్టం చేసిందో గానీ సన్‌రైజర్స్‌ను మాత్రం కష్టాల్లోకి నెట్టింది. నిరుడు ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 45 సగటుతో 641 పరుగులు రాబట్టిన వార్నర్‌ అన్నీ తానై జట్టును నడిపించాడు. తీరా ఐపీఎల్‌ ఆరంభానికి 10 రోజుల ముందు వార్నర్‌పై నిషేధం పడటం సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బే. గత ఏడాది తుది జట్టులో చోటే నిలుపుకోలేకపోయిన విలియమ్సన్‌ ఇప్పుడా జట్టుకు నాయకుడు. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని అలెక్స్‌ హేల్స్‌ ఇప్పుడు వార్నర్‌కు ప్రత్యామ్నాయం! మరి వీళ్లు ఏ మేరకు వార్నర్‌ లేని లోటును భర్తీ చేస్తారో చూడాలి.

బ్యాటింగ్‌లో.. వార్నర్‌ స్థానంలో జట్టులోకొచ్చిన హేల్స్‌ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం లాంఛనమే. అతడిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. సన్‌రైజర్స్‌కు మొదట్నుంచీ ఓపెనర్‌గా వ్యవహరిస్తున్న ధావన్‌ (2017లో 449 పరుగులు) మరోసారి అండగా నిలవడం జట్టుకు అత్యంత కీలకం. దక్షిణాఫ్రికాలో అతడి ఫామ్‌ జట్టుకు కలిసొచ్చేదే. సన్‌రైజర్స్‌ 2016 ప్రదర్శనను పునరావృతం చేయాలంటే మాత్రం ధావన్‌, హేల్స్‌ సత్తా చాటాల్సిందే. మిడిలార్డర్‌లో సన్‌రైజర్స్‌ కాస్త పటిష్టంగానే ఉంది. మనీష్‌ పాండే, విలియమ్సన్‌, యూసుఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడా, సాహాలతో బలంగా కనిపిస్తోంది.

బౌలింగ్‌లో.. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు వార్నర్‌ ఎంతో.. బౌలింగ్‌లో భువనేశ్వర్‌కుమార్‌ అంతే! బౌలింగ్‌ విభాగానికి సారథి భువీనే. డెత్‌ ఓవర్లలో తిరుగులేని బౌలర్‌. 2016, 2017 సీజన్‌లలో అత్యధిక వికెట్లతో నీలి రంగు క్యాప్‌ అందుకున్నాడు. భువికి అఫ్గానిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (నిరుడు 17 వికెట్లు) జతకలిస్తే ఎంతటి బ్యాటింగ్‌ లైనప్‌ అయినా వారి ముందు దిగదుడుపే. భువితో పాటు సిద్ధార్థ్‌ కౌల్‌ (16 వికెట్లు), సందీప్‌శర్మ (17), బాసిల్‌ థంపి (11) వంటి వైవిధ్యమైన పేసర్లు జట్టులో ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చేదే. లోపాలు: జట్టులో భారీ షాట్లతో విధ్వంసం సృష్టించగల బ్యాట్స్‌మన్‌ లేకపోవడమూ లోపమే. యూసుఫ్‌ పఠాన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సమర్థత, నిలకడపై ఎప్పుడూ సందేహాలే. ధావన్‌, హేల్స్‌లో ఎవరైనా దూరమైతే సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం జట్టులో మరో లోపం.

Previous Post