జోన్ల వెనక కేసీఆర్‌ బహుముఖ వ్యూహం

Admin 2018-05-25 Politics

తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల పరంగా స్థానికులకే అత్యధిక ప్రయోజనాలను కల్పించే సంకల్పంతో గత పది రోజులుగా ఆయన తెలంగాణలోని మేధావులు, నేతలు, న్యాయనిపుణులతో విస్తృతస్థాయి చర్చల అనంతరం కొత్త విధానాన్ని రూపొందించి గురువారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో విద్యా,ఉద్యోగ నియామకాలకు సంబంధించి జోనల్‌ విధానం కీలకమని భావించిన కేసీఆర్‌ దీనిపై బహుముఖ వ్యూహాన్ని ఎంచుకున్నారు. గతంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉపసంఘం నాలుగు నెలల క్రితమే నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక సమగ్రంగా లేదని.. దానిపై మరింత అధ్యయనం అవసరమని సీఎం భావించారు.ఈ నెల 16న ఉద్యోగుల కమిటీతో చర్చల సందర్భంగా జోనల్‌ విధానంపై చర్చ వచ్చినప్పుడు కేసీఆర్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చిందనుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆ కమిటీ అధ్యయనం ప్రారంభించిన తర్వాత మరోవైపు ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను సీఎం కోరారు. దీంతో పాటు ఆయన జోనల్‌ విధానంపై అనుభవజ్ఞులైన విశ్రాంత అధికారులు, 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో చర్చల తర్వాత విధానం తయారు చేసినట్లు తెలిసింది.

ఏడు జోన్లు...

ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లుండగా అందులో రెండు తెలంగాణలోనివి. ఇప్పుడు ఆ రెండు జోన్లనే ఏడుకు పెంచారు. తాజా నిర్ణయం ప్రకారం అత్యధిక జోన్లు ఉన్న చిన్న రాష్ట్రంగా తెలంగాణ మారనుంది. కొత్త జిల్లాల ఉనికిని చాటేందుకు, ఆ ప్రాంతాల ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో లబ్ధి కలిగించేందుకు వీలుగా ఎక్కువ జోన్లు ఉండాలని సీఎం భావించినట్లు తెలిసింది. విద్యా, ఉపాధి పరంగా భూపాలపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల పరిస్థితి ఒకేలా ఉందనే భావనతో మొదటి జోన్‌లో చేర్చారు. పట్టణ, విద్యాపరంగా ఉన్నతంగా ఉన్న నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ను రెండో జోన్‌లో, కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ను మూడో జోన్‌లో, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ గ్రామీణ, నగర జిల్లాలను నాలుగో జోన్‌లో, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగామను అయిదో జోన్‌లో చేర్చారు. ఆరు, ఏడో జోన్‌లపై కొంత చర్చ నడిచింది. మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలుతో పాటు వికారాబాద్‌ జిల్లా చేర్చడంపై మాట్లాడారు. వికారాబాద్‌ను హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలున్న జోన్‌లో చేర్చాలని స్థానికులు ఆందోళన చేస్తున్న అంశాన్ని అధికారులు, నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. వికారాబాద్‌ విద్యా, ఉద్యోగాల పరంగా పై రెండు జిల్లాలతో పోటీ పడలేదని సీఎం వాఖ్యనించారు. పాలమూరు దాని పరిధిలోని జిల్లాలతో ఉండడమే వికారాబాద్‌కు మేలవుతుందని ఆయన నిర్ణయించారు. ఆరోజోన్‌లో ముందుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను ఉంచాలని భావించినా పటాన్‌చెరు వరకు సంగారెడ్డి జిల్లా విస్తరించి ఉన్నందున హైదరాబాద్‌తో పోటీ పడే సత్తా దానికి ఉందనే భావనతో దానిని కొత్తగా ఈ జోన్‌ పరిధిలో చేర్చినట్లు తెలుస్తోంది.

బహుళ జోన్లపై...

బహుళ జోన్ల కూర్పు సందర్భంలోనూ సీఎం ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. మొదటి బహుళ జోన్‌లో నాలుగు జోన్లను, రెండో బహుళ జోన్‌లో మూడు జోన్లను చేర్చారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రస్తుత నియామక విధానంలో రిజర్వేషన్లు లేవు. మొత్తం ఓపెన్‌ కోటాయే అమలులో ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న ఈ నిర్ణయంవల్ల తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందనే వాదన ఇక్కడి ఉద్యోగుల్లో ఉంది. రాష్ట్రస్థాయి పోస్టుల్లోనూ రిజర్వేషన్ల విధానం తేవాలని వారు సీఎంను గత నాలుగేళ్లుగా కోరుతున్నారు. దీనికి న్యాయపరమైన అడ్డంకులుంటాయనే కారణంతో సీఎం బహుళజోన్ల వ్యవస్థపై దృష్టి సారించినట్లు తెలిసింది. రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసి, ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌లో ఉన్న పోస్టులను వీటిల్లోకి మళ్లించాలని యోచించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీని వల్ల రాష్ట్ర కేడర్‌లోని పోస్టులు తగ్గుతాయి. బహుళజోన్లలోని పోస్టుల్లో చేరిన వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా రాష్ట్రస్థాయి పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు.

నేడు ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

జోనల్‌ వ్యవస్థకు సంబంధించి ఏయే పోస్టులు, ఏయే కేటగిరిలో ఉండాలి, ఎంత మేరకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు ఉండాలనే దానిపై సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల నేతలైన శ్రీనివాస్‌గౌడ్‌, దేవీప్రసాద్‌ను సూచనలు అడిగారు. వారు తాము అన్ని సంఘాలతో మాట్లాడి జాబితాను ఇస్తామని చెప్పారు. దీని కోసం శుక్రవారం టీజీవోభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి అన్ని సంఘాలను ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో జూనియర్‌ అసిస్టెంటు స్థాయి వరకు జిల్లా కేడర్‌లో పోస్టులున్నాయి. సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు జోనల్‌ పరిధిలోనివారు. ఒకటో, రెండో గ్రేడు గెజిటెడ్‌ అధికారులు బహుళ జోన్‌ పరిధిలో ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, సీటీవో, ఆర్టీవోలు ఇతర గ్రూపు-1 అధికారులు, రాష్ట్ర స్థాయి పోస్టుల పరిధిలో ఉన్నారు. సచివాలయం, రాజ్‌భవన్‌, శాసనసభలో పనిచేసే మొత్తం ఉద్యోగులు కూడా రాష్ట్ర కేడర్‌లోని వారే.

ఇవీ రిజర్వేషన్లు

ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం జిల్లా కేడర్‌లో 80:20 నిష్పత్తి, జోనల్‌కేడర్‌లో 70:30, బహుళజోన్‌ కేడర్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లున్నాయి.వీటిలో మార్పులు చేసి, అన్నింటా 80:20 విధానం తేవాలని ఉద్యోగ సంఘాల ఐకాస కోరింది. రాష్ట్ర కేడర్‌లో రిజర్వేషన్‌ వస్తే 90:10 విధానం తేవాలని, లేకుంటే మొత్తం పదోన్నతుల ద్వారా ఆపోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థిస్తున్నాయి. శుక్రవారంజరిగే ఐకాస సమావేశంలో దీనిపై తీర్మానం చేయనున్నారని తెలిసింది.

కొత్త జోనల్‌ విధానాన్ని స్వాగతిస్తున్నాం: ఉద్యోగ సంఘాల నేతలు

రాష్ట్ర ప్రభుత్వ కొత్త జోనల్‌ విధానాన్ని స్వాగతిస్తున్నామని, ఇది అందరికీ ఆశాజనకంగా ఉందని తెలంగాణ ఉద్యోగ, అధికారుల, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్‌ విధానం ఆంధ్రా, రాయలసీమ ప్రయోజనాల మేరకు ఉండేదని, తెలంగాణకు విస్మరించించిందని, సీఎం కేసీఆర్‌ రూపొందించిన విధానం తెలంగాణలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని టీఎన్జీవోల గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌, టీజీవోల ఛైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఐకాస నేతలు కారెం రవీందర్‌రెడ్డి, మమత, సత్యనారాయణ, రాజేందర్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, శివశంకర్‌, మధుసూదన్‌రెడ్డి, పద్మాచారి, రాజ్‌కుమార్‌గుప్తా, జీటీ జీవన్‌, సతీష్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర నేతలు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. కొత్త జోనల్‌ విధానంతో పాటు బహుళజోన్లు ఉండటం వల్ల తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. హామీ మేరకు సీఎం బదిలీ ఉత్తర్వులను జారీ చేయడంపైనా సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post